ఆంధ్ర ప్రదేశ్

వివేకా మరణంపై నిజాలు బయటపెట్టిన కుమార్తె సునీతారెడ్డి

Viveka's Daughter Press Meet on Father's Murder
వివేకా మరణంపై నిజాలు బయటపెట్టిన కుమార్తె సునీతారెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పులివెందులలో బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె మాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రతీ బహిరంగ సభలో సొంత కుటుంబీకులే వివేకాను చంపారని చెబుతున్నారని, దానిపై మీ స్పందనేంటని ఆమెను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

అందుకు ఆమె స్పందిస్తూ.. సిట్‌ను ఏర్పాటు చేశారని, దోషులెవరనేది విచారణలో తేలకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని సునీత మండిపడ్డారు. తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని అంటున్నారని, కానీ తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆమె వెల్లడించారు. అయినా 700 మంది ఉన్న పెద్ద కుటుంబం తమదని, ఇంతపెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్నచిన్న విభేదాలు ఉండటం సహజమని, దీనర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు.

అది మా సంస్కృతి కాదు. మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఇది అర్థం చేసుకోవడానికి కొంతైన మానసిక పరిపక్వత ఉండాలి. ఏటా మా కుటుంబ సభ్యులు ఒకచోట కలుసుకుంటాం. మా లాంటి కుటుంబం ఎక్కడా ఉండదు అని ఆమె అన్నారు . సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోంది. ఈ బృందం నుంచి ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది.

చాలా నెగటివ్‌ వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు. జగన్‌ సీఎం కావాలని మా నాన్న బాగా కష్ట పడ్డారు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి అని విజ్ఞప్తి చేశారు. హత్యా ఘటనపై సునీత అభిప్రాయమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ సమయంలో నా అభిప్రాయాలతో సంబంధం లేదు.

పెద్ద వాళ్లే ఊహాగానాలు వ్యాప్తి చేస్తుంటే దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుంది కదా.. లేఖలో ఉన్న చేతి రాత ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుంది. నేను చెప్పడం సరికాదు.’ అని బదులిచ్చారు. సీబీఐ విచారణ అని జగన్‌ అంటున్నారు. మీరు అదే కోరుకుంటారా.. అన్న మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరగడం ముఖ్యం. అది ఏ సంస్థ అయినా సరే అని ఆమె అన్నారు.

To Top
error: Content is protected !!