తెలంగాణ

హైదరాబాద్‌లో మాయమైన ఆర్టీసీ బస్సు- ప్రత్యక్షం

TSRTC Bus Found At Nanded
హైదరాబాద్‌లో మాయమైన ఆర్టీసీ బస్సు- ప్రత్యక్షం

హైదరాబాద్‌లో మాయమైన ఆర్టీసీ బస్సు పొరుగు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యింది. ఓ షెడ్డులో బస్సును ధ్వంసం చేస్తుండగా అఫ్జల్‌గంజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బస్సును చోరీ చేసిన ముగ్గురు పారిపోగా.. షెడ్‌లో బస్సును ధ్వంసం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బస్సు అక్కడికి ఎలా చేరిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ఓ షెడ్‌లో దొంగిలించిన బస్సును పూర్తిగా ధ్వంసం చేశారు. బస్సుపై టాప్‌తో పాటూ చుట్టు పక్కల ఉన్న ఇనుప రేకుల్ని తొలగించారు. కింద టైర్లు.. ఇనుప చట్రాలు తప్ప ఏమీ లేకుండా తుక్కు, తుక్కు చేశారు. బస్సును అపహరించింది ఎవరు.. తెలుగు రాష్ట్రాల దొంగలా.. అంతరాష్ట్ర దొంగల ముఠా పనా అంటూ ఆరా తీస్తున్నారు పోలీసులు.

కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్ (AP11Z 6254) రోజూ కుషాయిగూడ-అఫ్జల్‌గంజ్ మధ్య నడుస్తోంది. ట్రిప్ ముగించుకొని.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సీబీఎస్ డిపోకు చేరుకుంది. డ్రైవర్ వెంకటేశం, కండక్టర్ రాహుల్ బస్సును సీబీఎస్ డిపో-1లో పార్క్ చేసి రెస్ట్ రూమ్‌కి వెళ్లి పడుకున్నారు. బుధవారం ఉదయం లేచి చూసేసరికి బస్సు కనిపించలేదు. కంగుతిన్న డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం ఇచ్చి.. అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బస్సను డిపోలో పార్క్ చేసిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా మెట్రో బస్సును మంగళవారం రాత్రి 11.02కి పార్క్ చేయగా 12.03 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. రాత్రివేళ కావడంతో వారి ముఖాలు సరిగా కనిపించలేదు. ఈ బస్సు రంగమహల్ హోటల్ మీదుగా నగరం దాటి నాందేడ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అదేరోజు 1 గంట సమయంలో బస్సు తూఫ్రాన్ టోల్‌గేట్ దాటినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు ఆ మార్గంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఇలా సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో బస్సు జాడను కనిపెట్టారు.

To Top
error: Content is protected !!