తెలంగాణ

మరో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్!

TRS announces Prabhakar Rao as candidate for Council election
మరో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్!

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నలుగురు అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు కూడా వేయించింది. ఈ ఎన్నికలు ముగియగానే చేపట్టనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ ఇప్పుడే ఓ అభ్యర్థిని ఎంపికచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంకోసం టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు.

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు కే మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో అతడు టీఆర్ఎస్ తరపున శాసన మండలికి పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు ప్రభాకరరావు రెండు సార్లు వరుసగా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.

ఈసారి కూడా మళ్లీ ఆయనకే అవకాశం రావడంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. 2013 లో టిడిపి, బిజెపి, మజ్లీస్ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ వైపు కదిలారు. 2015 లో గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ మండలిపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడంలో కూడా ప్రభాకరరావు కీలక పాత్ర పోషించారు.

దీంతో అతడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన టీఆర్ఎస్…ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది.ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ…తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ప్రభాకరరావు పేర్కొన్నారు.

To Top
error: Content is protected !!