క్రీడలు

వైఫ్‌కు రోహిత్‌ వాలెంటైన్స్‌డే స్పెషల్‌ గిఫ్ట్‌!

rohith sharrma valentine's day gift to rithika
వైఫ్‌కు రోహిత్‌ వాలెంటైన్స్‌డే స్పెషల్‌ గిఫ్ట్‌!

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రత్యేక కానుకతో ఆయన సతీమణి రితికా సజ్దేకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన భార్య అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్త పరిచిన రోహిత్‌ తాజాగా మరో స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో సెంచరీతో చెలరేగి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌​‍కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించిన విషయం తెలిసిందే.

అయితే ఈ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను రోహిత్‌ తన సతీమణికి బహుమతిగా ఇచ్చాడు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రేమికుల రోజు శుభాకాంక్షలు రితికా’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన వద్ద మేనేజర్‌గా పనిచేసే సమయంలో రితికాతో ప్రేమ వ్యవహారం నడిపిన రోహిత్‌ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

గతంలో పెళ్లిరోజున తన ఆటను కళ్లారా చూసేందుకు వచ్చిన భార్యకు రోహిత్‌ డబుల్‌ సెంచరీ బాది అపురూపమైన కానుక ఇచ్చాడు. సెంచరీ అనంతరం భార్యవైపు చూస్తూ ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి పెళ్లిరోజును మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్న ఈ జంటపై అప్పట్లో సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

‘నాకు ప్రత్యేకమైన రోజున నా భార్య పక్కన ఉండటం సంతోషకరమైన విషయం. ఆమెకు నేనిచ్చిన ఈ బహుమతి బాగా నచ్చిందనుకుంటున్నా. ఆమె నాబలం. ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది’ అని ప్రపంచ రికార్డు అనతరం తన సతీమణిపై ఉన్న ప్రేమను రోహిత్‌ చాటుకున్న విషయం తెలిసిందే.

ఇక కెరీర్‌లో 17వ సెంచరీ సాధించిన రోహిత్‌.. గత నాలుగు వన్డేల్లో దారుణంగా విఫలమై అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సెంచరీ సాధించి అందుకున్న మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ను బహుమతిగా ఇవ్వడంపై రితికా ఎంత సంతోషపడిందో అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

To Top
error: Content is protected !!