తెలంగాణ

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కనిపించడం లేదు..

revanth reddy facing oppostion from congress leaders
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కనిపించడం లేదు..

మీడియాలో రేవంత్ మాటే వినిపించడం లేదు. బస్సు యాత్రలో ఆయన ఊసే లేదు. అవును ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గొంతు మూగబోయింది. గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడనున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. పార్టీ కార్యక్రమాల్లో రేవంత్ ఎక్కడా కనిపించడం లేదు. గాంధీ భవన్ లో అడుగు పెట్టడం లేదు. సిఎల్పీలో కూర్చోవడం లేదు. పీసీసీ ఛీప్ వైఖరీతో అసంత్రుప్తిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం మౌన ముద్ర దాల్చారు. పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా తనను పట్టించుకోకపోవడంపైన ఆయన గుర్రుగా ఉన్నారు. తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదన రేవంత్ లో కనిపిస్తోంది. కనీసం వారికైనా పదవులు ఇప్పించాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చే వ్యూహాంలో ఉన్నారు. పీసీసీ స్థాయిలో నాయకత్వం ఉదాసీనంగా వ్యవహారిస్తుండటంతో నేరుగా హైకమాండ్ తోనే తేల్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం తర్వాత అపాయింట్ మెంట్ దొరుకుతుందని భావించినప్పటికి రాహుల్ అందుబాటులోకి రాలేదు. తాజాగా కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పట్లో దొరికే సూచనలు లేవు. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రాహుల్ అపాయింట్ మెంట్ దొరకలేదు. టీడీపీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నేత మదన్ మోహన్ రావు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. అయితే ఆయన సమయం ఇవ్వకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడతూ వస్తోంది.

రాహుల్ గాంధీని కలిసిన తర్వాతనే రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కానున్నారు. తాను పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హైకమాండ్ వ్యవహారించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ శాసనసభా పక్ష నేత పదవి వదులుకొని రేవంత్ రెడ్డి కాంగ్రె్ లో చేరారు. తన స్థాయికి తగిన పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే తీసుకోనని తాజాగా రేవంత్ అన్నారు. ఆ పదవి తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటు పక్కన మరో కుర్చీ వేస్తారే తప్ప ప్రయోజనం ఉండదన్నది ఆయన ఆలోచన . పీసీసీ ఛీప్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం మినహా మరో మార్గం ఉండదు. కాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లే పదవి కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అప్పుడే తన ఆలోచలను సమర్థవంతంగా అమలు చేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. కనీసం తన సలహాలు తీసుకోవడానికి పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టపడని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారు.అందుకే ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. పార్టీని పరుగులు పెట్టించే వ్యూహాలను అమలు చేయడానికి అదే సరైన పదవన్నది ఆయన అంచనా. అందుకే తనతో పాటు తన అనుచరుల పదవులపైన అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ ఆలోచనలు తెలుసుకున్న తర్వాతే ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బస్సు యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొనడం లేదు. దీంతో సభలు ఉప్పు లేని పప్పుగా కనిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో జరిగే సభలకు రావాలని రేవంత్ రెడ్డిని స్థానిక నాయకులు కోరుతున్నారు. కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి రాకపోవడం తమకే మంచిదన్న ఆలోచనలో కొందరున్నారు. మొత్తానికి రేవంత్ అంశం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఎపిసోడ్ కు రాహుల్ ఎలా శుభం కార్డు వేస్తారో వేచి చూడాల్సిందే.

To Top
error: Content is protected !!