నేషనల్

పెళ్లికి బాజా మోగింది!

wedding celebrations
పెళ్లికి బాజా మోగింది!

‘‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..’’ అంటూ పెళ్లి కోసం ఎదురుచూసే యువతీ యువకులు ఎంతో మంది ఉంటారు! అలాంటి మాఘ మాసంలో మూఢం వల్ల ముహూర్తాలే లేకుండా పోయాయి! నవంబరు నెలాఖరు నుంచే మూఢం ప్రారంభమవడంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా బాజాభజంత్రీల సందడి లేదు! ఈ నెల చివరి వారం నుంచి మూఢం వీడనుండడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పెళ్లి సందడి మొదలవనుంది. సంబంధాలు కుదుర్చుకుని మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేకపోయిన వేలాది మంది వధూవరులు ఇక వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మే 13 వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. వరుసగా గురు, శుక్రమౌఢ్యాల కారణంగా గత ఏడాది అక్టోబరు తర్వాత మధ్యలో రెండు మూడు మినహా మంచి ముహూర్తాలే లేకుండా పోయాయి. శుక్రమౌఢ్యమి ఈ నెల 19తో ముగుస్తుండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఇళ్లల్లో పెళ్లి సందడి మొదలవనుంది. మాఘమాసం వివాహానికి శ్రేష్ఠం అని చెబుతారు. డిసెంబరులో విదేశాల్లో ఉండేవారికి సెలవులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నెలలో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. కానీ, గత ఏడాది నవంబరు చివరి నుంచే శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది. దీంతో మంచి ముహూర్తాలు ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. మార్చి 4న కూడా భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఉగాది వెళ్లాక చైత్ర, వైశాఖ మాసాల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే పెళ్లి ఖాయమైన వారు ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకొని, మే 13 లోగా మంచి ముహూర్తం చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చైత్ర, వైశాఖ మాసాలతో పాటు జ్యేష్ఠ మాసంలోనూ పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే అధికమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూదు కాబట్టి మే 13 లోపే శుభకార్యాలన్నీ జరుపుకోవాలి. లేని పక్షంలో శ్రావణం వరకు ఆగాల్సి ఉంటుంది. మౌఢ్యమి కారణంగా మాఘమాసంలో బోసిపోయిన ఫంక్షన్‌ హాళ్లు పెళ్లిళ్లకు ముస్తాబవుతున్నాయి. ఫిబ్రవరి చివరిలో, మార్చి ప్రారంభంలో పెళ్లిళ్లు ఉండటంతో పురోహితులు, పూల అంకరణ, వంటవారు, ఫొటో, వీడియోగ్రాఫర్లు బిజీగా మారనున్నారు. ఈ నెల 24 నుం చి మార్చి 4 వరకు తెలంగాణలో దాదాపు లక్ష 35 వేలకుపైగా వివాహాలు జరగనున్నా యి. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 10 రోజుల్లోనే దాదాపు 60 వేలకు పైగా వివాహాలు, హైదరాబాద్‌లో మరో 75 వేలకుపైగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఏపీలో ఒక్క కృష్ణా జిల్లాలోనే ఫిబ్రవరి చివరి వారంలో 25 30 వేల వివాహాలు జరగనున్నాయి. డిసెంబరు, జనవరి నెల ల్లో నిశ్చితార్థం చేసుకుని మౌఢ్యం కారణంగా మంచి ముహూర్తం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మేలో మళ్లీ అధిక జ్యేష్ఠమాసం వస్తుంది కాబట్టి ఈ లోగా పెళ్లిళ్లు జరిపేందుకు భారీగా సిద్ధమవుతున్నారు. మార్చి 4న బ్రహ్మాండమైన ముహూ ర్తం ఉండడంతో ఆ ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.

To Top
error: Content is protected !!