నేషనల్

జీఎస్టీని సంస్కరిస్తాం

rahul gandhi respects gst
జీఎస్టీని సంస్కరిస్తాం

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీ(గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌)ని సంస్కరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు. జీఎస్టీని సరళం చేసి సింగిల్‌ శ్లాబ్‌ పన్నుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని, దాన్ని తగిన స్థాయికి పరిమితం చేస్తామని చెప్పారు. జీఎస్టీకి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ‘భారీ గందరగోళాన్ని’ తొలగిస్తామన్నారు. కర్ణాటకలో జనాశీర్వాద యాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌ మంగళవారం గుల్బర్గాలోని బీడీఏ ఇంజనీరింగ్‌ కళాశాలలో వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఒకే పన్ను ఉండాలి. పేదలు, సామాన్యులు ఉపయోగిస్తున్న వస్తువులన్నింటినీ జీఎస్టీ నుంచి బయటికి తీసుకురావాలనేది మా ఆలోచన. 18 శాతం వద్దే సింగిల్‌ ట్యాక్స్‌ను పరిమితం చేస్తాం. అదే మా జీఎస్టీ’ అన్నారు. ఐదు శ్లాబ్‌ల జీఎస్టీని తమ పార్టీ వ్యతిరేకించిందని, కనీసం మూడు నెలలు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని కోరినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల జీవితాలను మార్చే జీఎస్టీ కావాలిగానీ, ప్రజలను పీల్చి పిప్పిచేసే జీఎస్టీ అవసరం లేదన్నారు. మన విదేశాంగ విధానాన్నీ ఎన్డీయే ప్రమాదంలో పడేసిందని రాహుల్‌ ఆరోపించారు. ‘ఇతరులతో సత్సంబంధాలే మన విదేశాంగ విధానంలో అత్యంత ముఖ్యం. అయితే నేడు ఈ ప్రాంతంలో భారత్‌ను ఏకాకిగా చేసేశారు. చైనాతో దుందుడుకు వైఖరి వద్దు. సైనిక వైఖరీ వద్దు. పూర్తిగా శాంతియుత వైఖరి ఉండాలి. దానికి మార్గాన్ని అన్వేషించాలి’ అని అన్నారు. పొరుగునున్న నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌లతో బలపడుతున్న చైనా సంబంధాలను ప్రస్తావిస్తూ..మన పాత మిత్రుడైన రష్యా సైతం మనకు పశ్చిమాన ఉన్న దేశంతో సఖ్యత పెంచుకుంటోందని పేర్కొన్నారు. చైనా 24 గంటల్లో 50 వేల ఉద్యోగాలు సృష్టిస్తుంటే, మన దేశంలో 450 ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలుగుతున్నారని ఆరోపించారు. ఆర్‌ఎ్‌సఎ్‌సపైనా రాహుల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)లకు ఆర్‌‌ఎస్‌ఎస్‌ కారణమని ఆరోపించారు. కేంద్ర కేబినెట్‌లోని మంత్రులందరికీ ఓఎ్‌సడీలుగా ఆర్‌ఎ్‌సఎస్‌ నేపథ్యం కల్గినవారిని నియమిస్తున్నారన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ విధానాలను పకడ్బందీగా అన్ని శాఖల్లోకి తీసుకురావడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. అంతకుముందు సోమవారం రాత్రి గుల్బర్గాలోని ఖాజా బందే నవాజ్‌ దర్గాలో రాహుల్‌ ప్రార్థనలు చేశారు. మంగళవారం బీదర్‌లో రోడ్‌షో నిర్వహించి 12వ శతాబ్దపు సంస్కరణల మహాపురుషుడిగా ఖ్యాతిగడించిన బసవణ్ణ అనుభవ మండపాన్ని దర్శించుకున్నారు. తొలిదశ పర్యటన ముగియడంతో బీదర్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. రాహుల్‌ రెండో విడత పర్యటన ఈనెల 23 నుంచి 26 వరకు బెళగావి డివిజన్‌లోని 6 జిల్లాల్లో కొనసాగుతుందని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ చెప్పారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో అవకాశవాద కూటమి వల్ల సైనికులు రక్తమోడుతున్నారని రాహుల్‌ ట్విటర్‌లో ఆరోపించారు.

To Top
error: Content is protected !!