నేషనల్

రాజ్యాంగ నిపుణుడు,తెలుగు తేజం పీపీ రావు కన్నుమూత

రాజ్యాంగ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పావని పరమేశ్వరరావు (84) కన్నుమూశారు. ఆయనకు ఇటీవల గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఇండియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో బుధవారం మరోసారి గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు. పీపీ రావు స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల. 1933 జూలై 1వ తేదీన ఆయన జన్మించారు. నెల్లూరులోని వీఆర్‌ కాలేజీలో బీఏ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టాను పొందారు.అనంతరం 1961లో ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. 1967 నుంచి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. 1976లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. 1991లో సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీపీ సేవలను గుర్తించిన ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది జూలై నాటికి 50 ఏళ్ల న్యాయవాద వృత్తిని పీపీ రావు పూర్తి చేసుకున్నారు. ఆయన కుమారుడు ప్రవీణ్‌, కోడలు మహాలక్ష్మి కూడా సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదులుగా ఉన్నారు.సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాదిగానూ పీపీ రావు పనిచేశారు. కేశవానంద భారతి, ఎస్‌ఆర్‌ బొమ్మై, పీవీ నరసింహారావు, బాబ్రీ మసీదు కూల్చివేత, బెస్ట్‌ బేకరీ వంటి కీలక కేసుల్లో వాదించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వాలను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని సుప్రీంకోర్టులో గట్టిగా సమర్థించారు. లౌకికవాద విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ర్టాలు కరసేవకులను ప్రోత్సహించినందున రాష్ట్రపతి పాలన విధించడంలో తప్పులేదని ఆయన వాదించారు. దీని ఆధారంగానే రాష్ట్రపతిపాలన విధింపును సుప్రీంకోర్టు సమర్థించింది. పీపీ రావు మృతిపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గౌరవ్‌ భాటియా వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. అలాగే ఆయన మృతికి సంతాపంగా సుప్రీంకోర్టు కేసుల విచారణను అర్ధాంతరంగా వాయిదా వేసింది. ఆయన మరణవార్త తెలియగానే న్యాయమూర్తులందరూ తమ ముందున్న కేసులన్నిటినీ వాయిదా వేసి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు తరలివెళ్లారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!