టీడీపీ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత చిక్కుల్లో పడ్డారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆమెకు విశాఖపట్నంలోని 12వ అదనపు జిల్లా జడ్జి, సమన్లు జారీచేశారు. ఈ విషయమై కాంట్రాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అనిత 2015, అక్టోబర్ నెలలో తన దగ్గర రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు.
ఇందుకు సంబంధించి, పోస్ట్ డేటెడ్ చెక్కుతో పాటు ప్రామిసరీ నోటును ఇచ్చారన్నారు.ఈ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయొద్దని, అనిత తనను పలుమార్లు కోరారన్నారు. తాను బ్యాంక్ లోన్ కు దరఖాస్తు చేశాననీ, రాగానే మొత్తం అప్పు తీర్చేస్తానని ఆమె చెప్పినట్లు, శ్రీనివాసరావు అన్నారు.
అయితే తనకు నగదు అవసరం కావడంతో, మరోసారి అనితను కలవగా ఆమె గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కు నంబరు 994220ను, ఇచ్చారని తెలిపారు.దీన్ని బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో డబ్బులు లేవని, మేనేజర్ సమాచారం ఇచ్చారన్నారు.
దీంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని అనితకు కోర్టు సమన్లు జారీచేసిందన్నారు. ఎన్నికల్లో చేసిన అప్పులను తీర్చడం కోసమే అనిత తన దగ్గర నగదు తీసుకున్నారని శ్రీనివాసరావు చెప్పారు.
