తెలంగాణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బాధ్యతలు ఇవే-కేసీఆర్!

CM asks newly elected Sarpanches to develop villages
కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బాధ్యతలు ఇవే-కేసీఆర్!

ఇటీవల తెలంగాణాలో మొత్తం 12751 గ్రామ పంచాయితీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు . దింతో చాల వరకు గ్రామాల్లో టీఆరెస్ విజయకేతనం ఎగరవేసింది . ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో పాటు గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్ తో నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గ్రామాల అభివృద్దికి సంబంధించి సర్పంచ్ లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో పలు సలహాలు, సూచనలు చేశారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ద్వారా ఎన్నికయిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గ్రామాభివద్దికి పాటుపడాలని సూచించారు. రాజకీయ, వ్యక్తిగత వైరాలను విడిచి గ్రామ ప్రజలందనికి కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు.

ఈ దిశగా సర్పంచ్ లకు శిక్షణనివ్వాలని రిసోర్స్ పర్సన్స్ కు కేసీఆర్ ఆదేశించారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతుందని…అందువల్ల గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళిలకు అమలు కావాలని సీఎం ఆకాంక్షించారు.గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని… సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.

మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల(స్మశాన వాటికలు) నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. గ్రామాల సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఛేంజ్ ఏజెంట్సుగా మార్చే బాధ్యతను రిసోర్సు పర్సన్లు చేపట్టాలని చెప్పారు. గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటామన్నారు.

అదే సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సస్సెండ్ చేసే విధంగా కఠిన చట్టాన్ని రూపొందించినట్లు సిఎం వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె. జోషి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

To Top
error: Content is protected !!