ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్రకు మరోసారి పట్టం కట్టిన ఆంధ్ర ఓటర్లు

ap election results 2019
పాదయాత్రకు మరోసారి పట్టం కట్టిన ఆంధ్ర ఓటర్లు

ఆంధ్ర రాజకీయాల్లో పాదయాత్రతో అధికారానికి చేరువ అయ్యే ఆనవాయితీ మరోసారి కొనసాగింది. ఇప్పటివరకూ పాదయాత్రలు చేసిన ప్రతి అధినేత అధికారంలోకి రావటం కనిపిస్తుంది. తాజాగా ఆ విషయం మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. సుదీర్ఘ పాదయాత్రతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

బాబు హవా ఒక రేంజ్లో సాగుతుందన్న ప్రచారం నడుస్తున్న వేళ.. కష్టాల్ని ఎదురొడ్డి మరీ సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 2004లో ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అదే తీరులో 2012లో టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం అంటూ పాదయాత్రను చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్ర 2014 ఎన్నికల్లో ఏపీలో ఆయన్ను అధికారంలోకి వచ్చేలా చేసిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల్ని తెర మీదకు తెస్తూ.. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్రను చేపట్టారు. 3648 కిలోమీటర్ల మేర నడిచిన జగన్.. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాల్ని.. వైఫల్యాల్ని ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఆయన పడిన కష్టానికి.. చేసిన శ్రమకు నిదర్శనంగా ఏపీ ప్రజలు స్టన్నింగ్ మెజార్టీని అందించారు. 175 నియోజకవర్గాలున్న ఏపీలో ఏకంగా 152 స్థానాల్లో మెజార్టీని జగన్ కు కట్టబెట్టారు. మొత్తంగా చూస్తే.. పాదయాత్రతో పవర్ లోకి రావొచ్చన్న ఆనవాయితీ కొనసాగేలా ఏపీ ప్రజలు చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

To Top
error: Content is protected !!