ఆంధ్ర ప్రదేశ్

ఇదే నిజమైతే ఆంధ్ర తలరాత మారుతుంది…

mukesh ambani to establish industries in ap
ఇదే నిజమైతే ఆంధ్ర తలరాత మారుతుంది...

ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని, ప‌రిశ్ర‌మ‌లు స్థాపించాలని పారిశ్రామికవేత్త‌ల‌ను కోరుతూ సీఎం చంద్ర‌బాబు దేశవిదేశాలు తిరుగుతున్నా ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ముఖ కంపెనీలేవీ అడుగు పెట్టలేదు. కొన్ని కంపెనీలు ఎంవోయూల స్టేజీని దాటి ముందుకు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో దేశంలోనే ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం రిల‌యన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ ప‌ర్య‌ట‌న కొత్త ఆశ‌లు చిగురించేలా చేస్తోంది. ముఖ్యంగా తిరుప‌తిలో ఎల‌క్ట్రానిక్ పార్క్ నిర్మాణానికి ఆయ‌న సుముఖ‌త వ్య‌క్తం చేశారు. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగి.. అనుకున్న స‌మ‌యానికి ఈ పార్క్ ప్రారంభ మైతే.. ఏపీకి భ‌విష్య‌త్‌లో ఇక తిరుగుండ‌దనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఏపీకి ఇత‌ర కంపెనీలు క్యూ కట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, త‌ద్వారా పారిశ్రామిక హ‌బ్‌గా రాష్ట్రం మారుతుందని అంచ‌నా వేస్తున్నారు.
ఎడారిలో ఒయాసిస్ దొరికితే.. ఆ అనుభూతిని వ‌ర్ణించ‌లేనిది. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల‌ని త‌పిస్తున్న నాయ‌కుడు చంద్ర‌బాబుకు ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గ‌డం తోడ‌య్యారు. విభ‌జ‌న‌తో కుదేల‌యిన రాష్ట్రానికి పరిశ్ర‌మ‌లు వ‌స్తేనే.. ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డంతో పాటు యువ‌త‌కు ఉద్యోగాలు, ఎంతోమందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చంద్రబాబు ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు. ఇందుకోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. పేరు మోసిన కంపెనీలు ఒక్క‌టి కూడా ఏపీలో త‌మ యూనిట్‌ల‌ను ప్రారంభించ‌క‌పోవ‌డంతో పారిశ్రామికంగా రాష్ట్రాభివృద్ధి అనుకున్న స్థాయిలో క‌నిపించ‌డం లేదు. ఎన్ని రాయితీలు క‌ల్పిస్తున్నా.. సింగిల్ విండో విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టినా కంపెనీలు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈ త‌రుణంలో ముఖేష్ అంబానీ ప్ర‌క‌ట‌న కొత్త ఆశ‌లు రేపుతోంది.
చంద్ర‌బాబుతో ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. అంతేగాక ఏపీ ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌కంగా తీసుకొచ్చిన రియ‌ల్ టైం గ‌వ‌ర్నెర్స్ సిస్ట‌మ్‌ను చూసి ఆశ్చ‌ర్య పోయారు. చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. మూడేళ్ల కింద‌ట సీఎం చంద్ర‌బాబు త‌న‌ను క‌లిసి ఏపీ విజ‌న్ గురించి వివ‌రించార‌నీ, అది కార్య‌రూపంలో క‌నిపించిన‌ప్పుడు చూద్దాంలే అనుకున్నాన‌ని ముఖేష్ అంబానీ అన్నారు. ఇప్పుడీ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని చూశాక‌.. అనుకున్న క‌ల‌ను సాకారం చేశార‌ని సీఎం చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని చూశాక‌.. ప్ర‌పంచంలోనే ఎక్క‌డా ఇలాంటి వ్య‌వ‌స్థ లేదని మెచ్చుకున్నారు. దీనిపై హ‌క్కులు పొంది, వేరే రాష్ట్రాల‌కు సేవ‌లు అందించ‌డం ద్వారా కొంత ఛార్జీలు ఏపీ వ‌సూలు చేయ్యొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
ఆంధ్రాలో కొన్ని కీల‌క సంస్థల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల‌తో రిల‌య‌న్స్ ముందుకొచ్చారు. తిరుప‌తిలో 150 ఎక‌రాల్లో ఎల‌క్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయ‌డానికి ముఖేష్ అంబానీ సుముఖ‌త వ్య‌క్తం చేశారు. దీనిలో జియోఫోన్లు, బ్యాటరీలు, సెట్ టాప్ బాక్స్ లు వంటివి త‌యారు చేయాల‌న్న‌ది ప్రతిపాదన. త‌మ ఉత్ప‌త్తుల్లో 80 శాతం ఉప‌క‌ర‌ణాల‌ను ఆంధ్రాలో త‌యారు చేసేందుకు రిల‌య‌న్స్ సింసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం విశేషం. దీంతోపాటు, పెద్దాపురంలో 150 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ముఖేష్ అంబానీ చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో 50 ఎక‌రాల్లో డిజిట‌ల్ పార్క్ నిర్మించి.. టెలీకాం, ఐటీ స్టార్ట‌ప్ ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం అభివృద్ధి చేస్తామ‌నీ చెప్పారు. అమ‌రావ‌తిని డాటా సూప‌ర్ ప‌వ‌ర్ గా తీర్చిదిద్దడంలో స‌హ‌క‌రిస్తామ‌ని అంబానీ స్పష్టం చేశారు.
అన్ని అనుమ‌తులు వ‌చ్చేస్తే మ‌రో రెండు వారాల్లోనే తిరుప‌తి ఎల‌క్ట్రానిక్స్ పార్క్ కి రిల‌య‌న్స్ శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపంలోకి వ‌స్తే ఏపీ పారిశ్రామిక భ‌విష్య‌త్తుకు ఇదో భ‌రోసాగా నిలిచే అవ‌కాశం ఉంది. రిల‌య‌న్స్ లాంటి దిగ్గజ సంస్థ భారీ ప్ర‌తిపాద‌న‌ల‌తో ఏపీకి రావ‌డం సానుకూలాంశమని వివ‌రిస్తున్నారు. ఓప‌క్క కేంద్రం నుంచి రావాల్సిన నిధులు స‌రిగా రాకున్నా, రాష్ట్రం ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో రిల‌య‌న్స్ సంస్థ ముందుకు రావ‌డం.. ఏపీలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు ఆస‌క్తి చూప‌డం మంచి ప‌రిణామ‌మనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది స‌క్సెస్ అయితేనే ఏపీకి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.

To Top
error: Content is protected !!