ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కి కొత్త గవర్నర్…..

bjp mp haribabu demands new governoe
ఏపీ కి కొత్త గవర్నర్.....

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఈనెల 11న ఆయన లేఖ రాశారు. తమ రాష్ట్రం నుంచే పాలన సాగాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు తన అధికారిక కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ, రాజధాని అమరావతి నుంచే పాలన సాగుతోందని తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తున్న రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విడగొట్టాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తున్న నేపథ్యంలో అమరావతిలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు అడుగులు పడ్డాయని వెల్లడించారు. అలాగే తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌ను నియమించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గవర్నర్‌ నరసింహన్‌ను వెంటనే మార్చాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఇంతకుముందు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. బీజేపీ నాయకులు గవర్నర్‌ నరసింహన్‌ను టార్గెట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

To Top
error: Content is protected !!