నేషనల్

విమాన ఆలస్యానికి….రూ.59కోట్ల పరిహారం

air india has to pay 59 crores to the passengers for flight delay
విమాన ఆలస్యానికి....రూ.59కోట్ల పరిహారం

దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికులకు భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చేలా ఉంది. విమానం ఆలస్యమైనందుకు 323మంది ప్రయాణికులకు 8.8మిలియన్‌ డాలర్లు( సుమారు రూ.59కోట్లు) చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. మే 9వ తేదీన దిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్‌ వల్ల ఈ సమస్య ఏర్పడింది.

మే 9వ తేదీన దిల్లీ నుంచి చికాగో వెళ్లిన ఎయిరిండియా విమానం 16 గంట్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్‌వాకీ ప్రాంతానికి మళ్లించారు. మిల్‌వాకీ నుంచి చికాగోకు విమానంలో 20నిమిషాల ప్రయాణం. అప్పటికే విమానంలోని వారు 16 గంటలు ప్రయాణించారు. డీజీసీఏ నిబంధలన ప్రకారం సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. అప్పటికే అందులోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోవడమే కాకుండా నిబంధనల ప్రకారం వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్‌కు అనుమతి ఉంది. దీంతో ఎయిరిండియా మరో దారి లేక రోడ్డు మార్గంలో సిబ్బందిని మిల్‌వాకీకి తరలించి విమానాన్ని చికాగోకు పంపించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ వల్ల విమానం ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు.

అయితే అమెరికా నిబంధనల ప్రకారం ఎయిరిండియాకు పెద్ద చిక్కొచ్చిపడింది. అక్కడి నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. 323 మంది ప్రయాణికులకు మొత్తం కలిపి 8.8మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానంలో 41మంది వీల్‌ఛైర్‌లో ఉన్నవారు, ఇద్దరు చిన్నారులు, ఒకరు ఆటిజంతో బాధపడుతున్న చిన్నారి ఉన్నారు. డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఆ సమయంలో ఎయిరిండియా ఈ ఘటనను ఉదాహరణగా చూపించింది.

To Top
error: Content is protected !!